Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్!'' అనేది పురాతన నానుడి. రోమన్ సామ్రాజ్యంలో రోమ్‌నగరం నుండి అన్నివైపులకు సూర్యకిరణాలు బయటికి వికిరణం (రేడియేట్) చెందినట్లు రహదార్లు వేశారట! అందుకే ఏదార్లో వెళ్లినా రోమ్‌నగరం వచ్చేదట! ప్రస్తుతం తెలంగాణలో కూడా అన్ని దార్లూ అటే. అంటే ఎటో చిన్న పిల్లలు కూడా చెపుతారు. ప్రజల గోడు పట్టించుకోని బీజేపీకి ఇప్పుడు మునుగోడే ఆలంబన! అక్కడి నుండి అసెంబ్లీకి నిచ్చెనలేసుకుంటోంది. బీజేపీ తెలంగాణలో అందలం ఎక్కాలంటే వారి 'ప్లాన్-ఎ' మునుగోడు. కాషాయం ఆనవాళ్ళయినా లేని దక్షిణ తెలంగాణలో, అదీ కమ్యూనిస్టుల కోటలో విజయబావుటా లెగరేస్తే... మరిన్ని గెలుపు గుర్రాలు గోడదూకి కండువాలు కప్పుకుంటే... ఇలా సాగుతోంది బీజేప్లీ ప్లాన్-ఎ. దొరికింది పెద్ద చేప. ఎరకూడా భారీగానే వేశారు. ఆర్ఎస్ఎస్ వారి సోషల్ ఇంజనీరింగ్ ఫలించింది. ఆ సామాజికవర్గం కోసం చేసిన నిరీక్షణ ముగిసింది. ఇది విజయవంతం కాకపోతే వొరలో నుంచి ప్లాన్-బి, ప్లాన్-సి తీస్తారు. 2002లో గుజరాత్లో అమలై కమలాన్ని విజయతీరంలోనే ఇప్పటిదాకా నిలిపింది ప్లాన్-సినే. దేశరాజధాని ఈశాన్య ప్రాంతంలో 2020లో అమలైంది కూడా అదే. అది ఎంత భయానకంగా ఉంటుందో మొన్న 7వ తేదీ జస్టిస్ మదన్.బి. లోకుర్ నాయకత్వంలోని ఐదుమంది జడ్జీలు (జి.కె. పిళ్ళై పూర్వ హౌంశాఖ ముఖ్యకార్యదర్శి) విడుదల చేసిన ''సిటిజన్స్ కమిటీ'' నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్లాన్-సి అమలయ్యేలోపు సిబిఐ, ఈడీల ద్వారా ప్లాన్-బి నడుస్తూనే ఉంటుంది. అందుకే ప్లాన్-ఎ దశలోనే బీజేపీని కట్టడి చేయగలిగితేనే మన తెలంగాణకు శ్రేయస్కరం. లేకుంటే మన 'గంగా-జమునా తెహజీబ్' ధ్వంసమవుతుంది. రక్తం ఏరులై పారుతుంది.
ఇక్కడొక కీలకాంశం ఉంది. చర్చ అభివృద్ధి చుట్టూ, అవినీతి చుట్టూ, కుటుంబ పాలన చుట్టూ తిప్పుతోంది బీజేపీ. గోడీ మీడియాలో కావల్సినంత ప్రచారం ఇదే. కుటుంబాలుండే ఏ బూర్జువా పార్టీకైనా ఉండే సమస్యే ఇది. దీనికి బీజేపీ ఏ కోశాన మినహాయింపు కాదనడానికి కావల్సినన్ని ఉదాహరణలున్నాయి. సొంత కుటుంబాన్ని విదిలించుకుని, వదిలించుకుని కార్పొరేట్లే తన కుటుంబం అనుకునే వ్యక్తికి వారే కుటుంబం. వారిసేవే పరమావధి. ప్రతీ బీజేపీ పాలిత రాష్ట్రంలో అవినీతి చిట్టా హనుమంతుని తోకంత ఉంది. కాగ్ రికార్డులు తవ్వినవారికి తవ్వుకున్నంత సమాచారం. మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కామ్‌లో తయారైన శంకర్‌దాదా ఎంబిబిఎస్ల లిస్ట్ ఎవరైనా శ్రద్ధగా సేకరిస్తే తెలుస్తుంది. 'యడ్డీ' బళ్ళారి మైనింగ్ స్కామ్ 'మడ్డి' ఉండనే ఉంది. తన ఇంట్లో కమోడ్లు కూడా బంగారంతో చేయించుకున్న గాలి జనార్థనరెడ్డి, శ్రీరాములు ఇంకా బీజేపీ కార్యకర్తలే! ఆర్టీఐకి అందనంత దూరంలో నిలిచిన పి.ఎమ్. కేర్స్‌లో ఎక్కడినుంచి ఎన్ని కోట్లు వచ్చాయో, దేనికోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదు. రాఫెల్ ఒక కుంభకోణమని ఫ్రాన్స్ మీడియా మొత్తుకుంటోంది.
ఇక అభివృద్ధి గురించి... అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తామేనన్నట్లు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లు యుద్ధం చేస్తూంటాయి. మొన్ననే హైదరాబాద్ వచ్చిన చంద్రబాబునాయుడు తాను చేసిన 'అభివృద్ధి' వల్లే హైదరాబాద్ ప్రపంచపటంలో నిలిచిందని చెప్పుకున్నారు. 'అభివృద్ధి' అంటే రోడ్లను వెడల్పు చేసి, ఫ్లైఓవర్లు కట్టే 'హైటెక్' పాలనే అయితే చంద్రబాబు పాలనే ఇంకా ఉండేది కదా! 1998-2004 మధ్య ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన రైతుల కాష్టాలు చూసి దేశం వెలిగిపోతోందన్న వాజ్‌పారు సర్కార్ నిజంగా 'అభివృద్ధే' చేసిందా? 2004-10 మధ్య మన దేశ జీడీపీ ఎనిమిదిన్నర శాతానికి ఉరికింది. సెన్సెక్స్ పుంజాలు తెంచుకుని పరిగెట్టింది. ఇదంతా అభివృద్ధనే నాటి ''సింగు పరివారం'' చెపుకున్నదే నిజమైతే సంఫ్‌ుపరివారానికి అవకాశం ఎక్కడ దొరికేది?
మునుగోడులో రోడ్లు ఎవరు బాగుచేస్తారో అదే అభివృద్ధి కాదు. అవి సర్పంచ్ ఎన్నికల్లోనో, మండల ఎన్నికల్లోనో మాట్లాడాల్సిన అంశాలు. బీజేపీ విధానాలు ఏరకంగా టీఆర్ఎస్ విధానాలకి భిన్నంగా ఉంటాయో చెప్పుకోవాల్సిన ఎన్నికలివి. పంచాయతీలకు, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల గురించి కాదు, ఐ.సి.డి.ఎస్ రక్షణ కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమిచేస్తున్నారు? 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా పంచాయతీలకు నిధులిస్తున్నారా? దేనిలో బీజేపీ విధానాలు టీఆర్ఎస్ విధానాలకు భిన్నంగా ఉన్నాయో చెప్పుకోవాల్సిన అసెంబ్లీ ఎన్నికలివి. మన రాష్ట్రంలో 3,700 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవు. బస్సులు ఉంటే రోడ్లుండేవి. 83 పార్లమెంటరీ నియోజకవర్గాలున్న యూపీలో కేవలం 12వేలే ఆర్టీసీ బస్సులు, మిగిలిన వన్నీ ప్రయివేటు బస్సులే. నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ నిర్వహిస్తున్న హర్యానాలో క్రమంగా ఆర్టీసీ బస్సులు తగ్గించేస్తున్నారు. దేంట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయో చెప్పగలిగి ఓటర్లను ఆకర్షిస్తే జనం హర్షిస్తారు. అందుకే గురివింద సవాళ్లు విసరలేదు. జంపు జిలానీలు రాజ్యాలేలలేరు. కాంట్రాక్టర్లతో ప్రజల సమస్యలు పరిష్కారం కావు.