Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక విషయం చిలికి చిలికి గాలి వానలాగా మారినప్పుడు అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అయితే వారిద్దరికే నష్టం. ఆ విధంగా ఏర్పడే కష్టానికి వారే బాధ్యులు. అదే ఆ అంశం వ్యవస్థకు చెందిందయితే అది ప్రజలకు శాపం. ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు.. రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన రాజకీయ అగాధం రాష్ట్రానికి చేటు తెచ్చేలా ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రథమ పౌరురాలు... పరిధిని దాటుతూ పరోక్షంగా రాజకీయ కార్యకలాపాలకు తన కార్యాలయాన్ని కేంద్ర బిందువుగా మార్చిన వేళ... ప్రభుత్వానికి సంబంధించిన అనేకానేకాంశాలు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంటున్నాయి. అవి మరుగున పడిపోతుండటంతో ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నది.
సెప్టెంబరులో నిర్వహించిన రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం ఎనిమిది బిల్లులకు ఆమోదముద్ర వేసింది. అందులో రెండు కొత్తవి, మిగతా ఆరూ చట్ట సవరణ బిల్లులు. వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించారు. ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు... కేంద్ర చట్టంతో ముడిపడి ఉన్నది. అందువల్ల రాష్ట్రపతి ఆమోదిస్తేనే అది అమల్లోకి వస్తుంది. ఈ రెండూ మినహా మిగతా ఆరింటికీ ఎలాంటి ఆటంకాల్లేనప్పటికీ గవర్నర్ వాటిపై దృష్టి సారించకపోవటం గమనార్హం. వాటిని ఒక్కో దాన్ని పరిశీలించి చూస్తే... రాష్ట్రంలో దాదాపు 80 వేల పై చిలుకు పోస్టులను భర్తీ చేస్తామంటూ ఇటీవల సర్కారు ప్రకటించింది. ఈ క్రమంలో విశ్వ విద్యాలయాల్లోనూ నియామకాలు చేపట్టేందుకు సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. ఈ బోర్డు రూపుదాల్చితే వర్సిటీల్లో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమమవుతుంది. ఎంతోమందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బిల్లుకు ఇప్పటికీ గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. విభజన హామీల్లో భాగంగా ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన కేంద్రం... ఆ హామీని తుంగలో తొక్కింది. అదే తరహాలో సిద్ధిపేటలో జిల్లా ములుగులో ఉన్న అటవీ కళాశాలను విశ్వవిద్యాలయంగానూ, పరిశోధనా సంస్థగానూ మార్చటానికి వీలు కల్పించే బిల్లు గవర్నర్ గారి కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నది. ఫలితంగా అక్కడి ప్రజల ఆశల మీద మేడమ్ నీళ్లు జల్లుతూ ఉన్నారు. జీహెచ్ఎమ్సీ, పురపాలక చట్టాల సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ బిల్లులు సైతం ఇదే విధంగా రాజ్‌భవన్ ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలా మూలకు పడేసిన వాటిలో విధానపరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నష్టదాయకమైన బిల్లు కూడా ఒకటి ఉంది. అదే ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతిస్తూ రూపొందించిన విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు. దీన్ని ఆమోదించాలని మనమేం కోరుకోనక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే దాన్ని వ్యతిరేకించాలి. విద్యావంతులు, మేధావులు, విద్యారంగ నిపుణులు, విద్యార్థి సంఘాలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ ఒక్క బిల్లును పక్కనపెడితే మిగతావన్నీ ప్రజా ప్రయోజనార్థం తీసుకొచ్చినవే. కానీ వాటిని గవర్నర్ పెండింగ్‌లో పెట్టటమంటే రాజకీయ కోణంలో చూడటమే. ఇప్పుడు అదే ప్రక్రియ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్ట సవరణ బిల్లుకు మాత్రం వెనువెంటనే గ్రీన్ సిగల్ ఇచ్చిన గవర్నర్... మిగతా వాటిపై అసలు దృష్టి సారించకపోవటమే అసలు సిసలు రాజకీయం. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది, చిన్న చూపు చూస్తున్నది, ప్రొటోకాల్ పాటించటం లేదంటూ ఆమె ఎన్ని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా వాటి వెనుక కమలనాథుల పక్కా స్కెచ్ దాగుందనేది బహిరంగ రహస్యం. అందుకే ఇన్ని కిరికిర్లు.. మతలబులు. ఇక్కడ ఢిల్లీ పెద్దలకు ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకన్నా వారి రాజకీయ ప్రయోజనాలే మిన్న. తెలంగాణ సర్కారును ఇబ్బందుల పాల్జేయటమే వారి పరమావధి. అందుకే రాజ్‌భవన్ వేదికగా శరవేగంగా అనేక పావులు కదుపుతున్నారు. రాజ్యాంగ ప్రతినిధి అయిన గవర్నర్ ఆ పావుల్లో ఒక పావుగా మారిపోకూడదు. అలా మారిపోవటమనేది ఆమె పదవికి ఔచిత్యం కాదు. అది బిల్లుల విషయంలోనైనా.. మరే విషయంలోనైనా. అందుకే మన రాష్ట్ర ప్రథమ పౌరురాలు రాజ్యాంగానికి.. రాజకీయాలకు ఉన్న సునిశితమైన రేఖను చెరపకుండా తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారని ఆశిద్దాం.