Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా! ఈలోకం కుళ్లు చూడకున్నావా! వున్నానవి చూస్తున్నావని నమ్మిఎందరో ఉన్నారు. నీ పేరిట వంచన పెరుగుతువుంటే, నీ ఎదుటే హింసలు జరుగుతువుంటే, మనషిని మనషే దోస్తూవుంటే, మంచికి సమాధి కడుతూ వుంటే...'' ఏం చేస్తున్నావు? అంటూ నిలదీస్తాడు ఓ భక్తుడు దేవుణ్ణి భక్తతూకారం సినిమాలో ఆవేదనతో తూకారాం ప్రశ్నిస్తున్న సందర్భం అది. అదే సన్నివేశం నేడు మనదేశంలో నెలకొని ఉన్నది. ఉన్నావా? అసలున్నావా? అని ప్రభుత్వాలనూ, పాలకులనూ, న్యాయాన్ని, ధర్మాన్నీ ప్రశ్నించే పరిస్థితి వచ్చేసింది. పై ఉదాహరణ మనకు ఏం నేర్పుతుందీ అంటే, 'భక్తుడు' కూడా భరించలేని అన్యాయాన్ని చూసి దేవుడిపై ప్రశ్నలెక్కుపెడతాడని, నిలదీస్తాడని బోధపడుతుంది. అందుకే చూసీ చూసీ పాలకుల కనుసన్నల్లో మెలగుతున్న న్యాయదేవతా నేడు ప్రశ్నించడం మొదలేసింది. ఎటుపోతున్నాం మనం అంటూ నిలదీస్తున్నంత పని చేసింది. ఆహ్వానించాల్సిన పరిణామమే కానీ ఎంతవరకు ఇది కొనసాగుతుందో ముందు ముందు చూడవలసిందే.
దేశంలో మత విద్వేష వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయని, వీటిని అరికట్టాలని, సుప్రీం జోక్యం చేసుకోవాలని వేసిన పిటిషన్పై విచారిస్తూ విద్వేష ప్రసంగాలపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ 21వ శతాబ్దంలో మతం పేరుతో ఎక్కడికి పోతున్నాం మనం! దేవుణ్ణి ఏ స్థాయికి దిగజారుస్తున్నాం? ఇది సహించరాదు. దేశం లౌకిక, సౌభ్రాతృత్వ దేశంగా ఉండాలని దేశ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. దేశ సమగ్రతను కాపాడుకోవాలని, భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న దేశాన్ని ప్రజాస్వామ్య విలువలతో నిలుపుకోవాలని, అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఎవరి చెవికి ఎక్కుతుందో ఏమోగానీ, చాన్నాళ్లకు మంచి సందేశాన్ని వినిపించింది. హిందువులపై దాడులు చేసేవారి తలలు, చేతులు నరికి వేయాలంటూ విశ్వహిందూ పరిషత్ నేత జగత్ గురు యోగేశ్వర్ ఆచార్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ఇలాంటివి సమాజంలో తీవ్ర అశాంతికి దారితీస్తాయని కోర్టు మండిపడింది. మత విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారనీ ప్రశ్నించింది. మత ప్రాతిపదికగా వివక్షతలు కొనసాగటం సరికాదని నొక్కి చెప్పటం గమనించాల్సిన విషయం.
భారత రాజ్యాంగంలోని అధికరణం 51ఏ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం చెబుతున్నది. మత స్వేచ్ఛ కలిగిన దేశాన మత విద్వేషం రెచ్చగొట్టటం, దేవుళ్లను ముందుపెట్టి ప్రజలను విభజించటం సహించరాదని డెబ్బయి ఐదేండ్ల స్వాతంత్య్రం తర్వాత మళ్లీ మళ్లీ చెప్పు కోవాల్సి రావటం ఒక విషాద విషయం. గత ఎనిమిదేండ్ల నుండి మతం పేరుతో జరుగుతున్న అనేక సంఘటనలు మానవత్వానికి, మన రాజ్యాంగ విలువలకి పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దహనాలూ, సాంస్కృతిక పరమైన వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న చర్యలూ సమాజాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. అయితే న్యాయస్థానాలు, అధికార వర్గాల సహకారంతో జరుగుతున్న ఈ ఆగడాలను అరికట్టి శాంతి సమానతలను సమకూర్చగలవా అనే సంశయాన్ని పక్కన పెట్టి, ధర్మాసనం చేసిన ఒక వ్యాఖ్యను గురించి ఆలోచించాలి మనం. అదేమంటే 'విద్వేష పూరిత వాతావరణాన్ని కొందరు ఎందుకు సృష్టిస్తున్నారంటే కొన్ని అంశాల్లో ప్రజల దృష్టిని మరల్చేందుకు' అని చెప్పిన విషయం నిండా నూరు శాతం యదార్థం. అసలు విషయమంతా అందులోనే ఉంది.
నిజంగా మతానికి ఆధారమైన దేవునికి ప్రపంచ ప్రజలందరి మీదా ఒకే విధమైన దయా కరుణా ఉంటాయనేది భక్తుల నమ్మకం. మరి ఈ ద్వేషాన్ని కలిగించే మూలసూత్రం ఏమిటి? వాస్తవంగా భక్తులు... మమ్మల్ని క్షేమంగా ఉంచమని, కష్టాలు, బాధల నుండి రక్షించమని, సుఖ సంతోషాలను కలుగజేయమని కోరుకుంటారు. కానీ వేరేమతం వారికి నష్టం కలిగించమని, వారిని అంతమొందించమని ఎవరూ వేడుకోరు. ఒకవైపు ప్రజలు ఆకలి, దారిద్య్రం, అనారోగ్యం, ఉపాధి లేమితో ఇక్కట్లు పడుతుంటే, పెరుగుతున్న ధరలతో జీవనం కష్టసాధ్యమవుతుంటే, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికార గణం, వారి దృష్టి మరల్చి భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అందుకోసం ప్రజలను విభజిస్తున్నారు. ద్వేషం అనేది దేవునిలో ఉండదు. అధికారపు దాహంలో ఉంటుంది. మన తోటి మనుషుల హృదయాలను గాయపరిచేవాడు, వారిని హతమార్చే రాక్షస హృదయుడు దేవుని భక్తుడు ఎలా కాగలుగుతాడు! ఈ పరివారపు మదినిండా విద్వేషమే కాని ప్రేమకు, భక్తికి తావేవుండదు.
మన సుప్రీం ధర్మాసనం ధర్మాగ్రహాన్ని సామాన్య ప్రజలు ప్రదర్శించాల్సివుంది. భక్తతూకారం నిలదీసినట్టుగానే మనం పాలకులను నిలదీయాల్సివుంది. లేకుంటే అన్యాయాలు, అమానవీయతలు కొనసాగుతూనే ఉంటాయి. సామాన్య ప్రజలు సమిధలవుతూనే ఉంటారు. అందుకే నిలదీయాలి. నిలువరించాలి.