Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పూర్తి భిన్నమైన రాజకీయ పక్షం పాలనలో ఏ రాష్ట్రమైనా ఉంటే అక్కడి గవర్నర్ పోషించే పాత్ర ఎలా ఉంటుంది?' రాజ్యాంగ సభ సభ్యులుగా బిశ్వనాథ్ దాస్ సంధించిన ప్రశ్న ఇది. అటువంటి సందర్భాల్లో గవర్నర్లు ఢిల్లీ ప్రభువుల సంకుచిత వ్యూహాల్లో పావులై, రాష్ట్ర ప్రభుత్వాల పాలిట అపర సైంధవులుగా పరిణమిస్తారన్న సందేహన్ని ఆనాడే ఆయన ఎత్తిచూపారు. అది నూరుపాళ్లు వాస్తవమేనని అనేక సార్లు రుజువైంది. నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ గవర్నర్ల ధోరణులతో ఆ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. తాజాగా 'ప్రతీ దేశం ఏదో ఒక మతంపైనే ఆధారపడిందనీ, భారతదేశం అందుకు మినహాయింపేమీ కాదని' తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆర్.ఎన్.రవిని ఆ పదవి నుంచి తక్షణమే తొలగించా లని కోరుతూ రాష్ట్రపతికి పంపే మెమోరాండంపై సంతకాలు చేయాల్సిందిగా భావసారూప్య ఎంపీలను కోరారు. విచక్షణాధికారాల వినియోగంలో న్యాయబద్ధత, నిష్పాక్షికతలకు సమాధికట్టి ఏకపక్ష, అహేతుక విధానాలకు గొడుగుపడుతున్న ఈ ''ప్రథమ పౌరుల'' తీరు సమాజాన్ని కలవరపరుస్తోంది. రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా రాజ్భవన్లు మారిన మూలంగానే ఆ రాజ్యాంగ వ్యవస్థ ఔన్నత్యం మసిబారిపోతోంది!
ప్రస్తుత గవర్నర్లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలై ప్రజాతంత్ర విలువలను మంటగలుపుతున్నారు. బూటాసింగ్, భండారీల వారసులు ఎక్కువవుతున్నారు. ఇందిర హయాములో మెలకెత్తిన ఆ పెడపోకడలు మోడీ హయాంలో పోటెత్తుతున్నాయి. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగవలసిన వ్యక్తి కాదని, ఆ పదవి రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థ అని 'ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం' కేసులో సర్వోన్నత న్యాయస్థానం కుండ బద్దలుకొట్టింది. గవర్నర్ల నియామకాధికారాన్ని అంతర్రాష్ట్ర మండలికి దఖలుపరచాలని బీజేపీ లోగడ గళమెత్తింది. పాలనా సంస్కరణల సంఘం, సర్కారియా, పూంఛీ కమిషన్లు వంటివీ ఆ దిశగా విలువైన సూచనలెన్నో చేశాయి. అవన్నీ అటకెక్కిపోయిన దురవస్థలో గవర్నర్ల ఎంపికలో పార్టీ విధేయతే పరమ ప్రమాణమైంది.
ఆమధ్య 'ప్రభుత్వమంటే నేనే' నంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా చేసిన నజీబ్ జంగ్ నోరు పారేసుకోవడం నివ్వెరపరిచింది. తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్ల చుట్టూ వివాదాలు ముదురుతుండటం, ఇవి సమాఖ్య భావన బీటలు వారడానికి రాజ్భవనే పుణ్యం కట్టుకుంటున్న వైనాన్ని కళ్లకు కడుతున్నాయి. తాను రబ్బరు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్రం రూపొందించిన శాసనాలను సమర్థించడాన్ని స్వీయ బాధ్యతగా పేర్కోవడం విస్తుగొలుపుతోంది. 24 గంటల్లో పదవుల నుంచి తప్పుకొమని అక్కడి రాజకీయాలను వేడెక్కించారు. మొన్న మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అనుసరించిన పోకడలు విస్మయపరిచాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్రాల్లో గవర్నర్లు నిర్వహించాల్సిన రాజ్యాంగ విహిత బాధ్యతలు పరిమితమైనవి, నామమాత్రమైనవి. ఏదైనా రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు తెరపైకి వచ్చి అత్యవసరంగా విధ్యుక్తధర్మం నిర్వర్తించాల్సిన గవర్నర్లు ఆ హద్దును దాటి తామే సంచలనాలకు కేంద్రబిందువుగా మారితే ఎలాగుంటుందో ఈ ఉదంతాలే ఉదాహరణలు.
రాజకీయేతరులను గవర్నర్లుగా ఎంపిక చేయాలన్న ప్రతిపాదనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం. ముఖ్యంగా రిటైరైన అధికారులకు అప్పగిస్త్లే కతజ్ఞతతో పూర్తిగా కేంద్రం చెప్పుచేతల్లో ఉంటారు. అందువల్లే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన కమిటీ ప్రాతిపదికన గవర్నర్ను రాష్ట్రపతి నియమించాలని...'రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించాలన్న నిబంధన వల్ల ఈ అరాచకం నెలకొంటోంది. స్వతంత్రంగా రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిన గవర్నర్లు కేంద్రం చెప్పుచేతల్లో రాజకీయ పావులుగా మారుతున్నారు. ఇది ఫెడరల్ ప్రజాస్వామ్య రాజకీయాలకు ఇది అనుగుణంగా లేదు. గవర్నర్ పదవిని ఉంచాలనుకుంటే అప్పుడు ఆ వ్యక్తిని రాష్ట్రపతి నియమించాలి. కూడా సర్కారియా కమిషన్ నిర్దేశించిన ప్రామాణి కాలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి సూచించిన ముగ్గు రు ప్రముఖుల జాబితా నుండే తీసుకోవాలి అని జస్టిస్ సర్కారియా కమిషన్, పుంచ్ఛి కమిషన్ల ముందు సీపీఐ(ఎం) పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో... గవర్నర్ల నియామకపు ప్రక్రియలో, రాజ్యాంగ అధికార విధి నిర్వహణా క్రమంలో ఎటువంటి సంస్కరణ లకు అవకాశం లేదు. ఈ తరుణంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ హక్కులు ఆక్రమణకు, దాడికి గురికాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడమే ఇప్పుడు చేయగలిగింది. దానితో పాటు, గవర్నర్లు తమకు నిర్దేశించిన ప్రమాణాలను, పరిధులను అతిక్రమించ కుండా ఉండేందుకుగానూ యూనివర్సిటీల చట్టం వంటి సంబంధిత చట్టాలను, శాసనాలను అసెంబ్లీలు సవరించుకోవాల్సి ఉంటుంది.