Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 27 సదస్సు జరగనుంది. పొంచి ఉన్న పర్యావరణ ముప్పు నుండి ప్రపంచాన్ని కాపాడేందుకు ఈ సదస్సు ఏం చేయబోతోంది..? ఇప్పుడు ప్రతి చోటా ఇదే ప్రశ్న. వాతావరణం మారిపోయింది. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే ప్రాంతాల్లో కూడా ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలి కాలంలో రోళ్లుపగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏకమవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచుకొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమండలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొని తెచ్చుకున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యా వరణవేత్తలు హెచ్చ రిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్పవంటూ, ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను 1.5 సెంటిగ్రేడ్ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవావరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద, వర్ధమాన దేశాలు చేసేదేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూలకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగం వల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్హౌస్ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్ పొరను ఈ గ్రీన్హౌస్ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయువులు 43 శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6 శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొనడం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియజేస్తోంది.
శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగిపోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడేస్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు 'ద లాన్సెట్' మెడికల్ జర్నల్ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈ నేసథ్యంలో ఈజిప్టులో కాప్ 27 సదస్సు జరుగుతోంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. కానీ బ్రిటన్ నూతన ప్రధాన మంత్రి రిషి సునాక్ ఈ సదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.