Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యేటికి ఎదురీదేవాళ్లు కొందరుంటారు. తామెంతగా నష్టపోయినా, మిక్కిలి ఇక్కట్లకు గురయినా, ఎన్ని సవాళ్లు ఎదురయినా విలువల అడుగులపైనే నిలబడి ఉంటారు. వారు అరుదుగా కనిపించవచ్చు. ఆశ్చర్యమూ కలుగవచ్చు. కానీ కొందరుంటారు అలా! కాపలాకాస్తున్నతీరుగా. పతనమవుతున్న విలువలు ఒకవైపు, వాటిని ప్రతిఘటిస్తూన్న ఘర్షణ మరోవైపు నిత్యం ఉంటూనే ఉంటుంది. వాటిని గమనిస్తున్నప్పుడే ఎటువైపు మనం నిలవాలో తెలుస్తుంది. విలువలు బేరీజు వేయడం ఒక పెద్ద సమస్య. ఈ సందర్భంలోనే దాదాపు నూటాయాభైయేండ్ల క్రితమే వివరించిన విషయం గుర్తురాక మానదు. ''ఇంతకు ముందు ప్రజలు భక్తిగౌరవాలతో, విశ్వాసంతో ఆదరించిన వృత్తులను అది నీచపరుస్తుంది. వైద్యుడినీ, న్యాయవాదినీ, పురోహితుడినీ, శాస్త్రవేత్తనీ అది తన జీతగాళ్లుగా మార్చుకొంటుంది'' అని పేర్కొన్న విషయం ఎంత వాస్తవిక దృశ్యం. ఇప్పుడు మన కండ్లముందు జరుగుతున్నదదే కదా! ఇలా చేస్తున్నదొక్కటే అది పెట్టుబడి. దీని మహత్యం అంతా ఇంతా కాదు. మనమేమీ తెలుసుకోలేనంతగా మనపై కొత్తవిలువల్ని, ఆలోచనల్ని రుద్దుతుంది. అవే అసలువని నమ్ముతాం కూడా.
అయితే బలహీనంగానైనా కొన్ని గొంతులు ఎదురునిలబడి నినదిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలా నిలబడినవాళ్లను చూస్తూనే ఉన్నాం. నేటి ఆధునిక సమాజంలో ప్రచార ప్రసార సాధనాల విస్తరణ పెరిగిన తరుణంలో వార్తా మీడియా ఛానెళ్లరూపంలో ప్రతివారి చేతుల్లోకి వచ్చేసింది. ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నది. ప్రజల భావాలను, అభిప్రాయాలను, ఆలోచనలనూ మీడియానే తీర్చిదిద్దుతున్న వేళ, దీన్ని సంపూర్ణంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నది పెట్టుబడి. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకకాదు. ప్రజాగొంతుక అసలేకాదు. ఆధిపత్య భావాలకు, ఆచరణకు సమ్మతిని సమకూర్చే ఉత్పత్తిసాధనమిది. ఇది కొత్తగా జరిగిందేమీ కాదు. కానీ కొత్తపుంతలు తొక్కుతున్నది. దేశంలో పత్రికలు, వార్తా ఛానళ్లు పెట్టుబడుల సమకూర్పుతోనే ప్రారంభమైనా కొంత స్వతంత్ర విధానంతో, నిజాయితీతో, నిష్పక్షపాతంగా నడిచేవి. అంతేకాదు, ఆయా రంగాలలో నైపుణ్యమూ, సామర్థ్యము ఉన్నవాళ్లతోనే నడుపబడేవి, కొనసాగేవి. ఇప్పుడవన్నీ బహుళజాతి సంస్థలూ, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడిక నిపుణులు, మేధావులు అందరూ కేవలం జీతగాళ్లు మాత్రమే. అలా మారిపోయిన సంఘటనే ఎన్డిటివి ఛానల్‌ను ఆదానీగ్రూప్ కంపెనీ స్వాధీనం చేసుకోవడం.
1984లో మొట్టమొదటిసారి స్వతంత్ర నెట్‌వర్క్‌తో ఎన్.డి.టి.వి. 24/7ను ఏర్పాటు చేసింది. అత్యంత ప్రసిద్ధ నెట్‌వర్క్‌గా పేరుతెచ్చుకున్నది. మూడున్నర కోట్లమంది అనుసరిస్తున్నారు. దీని సమాచారాన్ని విశ్వసిస్తున్నారు కూడా. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నించడం, వాస్తవిక విషయాలను అందించడంతో దీనికా విశ్వాసనీయత పెరిగింది. అలాంటి ఛానెల్ ఇప్పుడు ఆదానీ గ్రూపు వశమైంది. ఆ వెంటనే దాని వ్యవస్థాపకులు ప్రణరురారు, రాధికారారులు వారి పదవులకు రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. ఆ మరునాడే అత్యంత ప్రతిభా వంతుడు, నిజాయితీపరుడు, నిబద్ధతగల పాత్రికేయుడు రవీష్‌కుమార్ కూడా ఛానెల్ నుండి నిష్క్రమించాడు. 'ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడు కూడా నిన్ను కొనలేకపోయాడు చూడు... అదీ నీ నిజాయితీ' అని రవీష్కుమార్ని నేటిజన్లు ప్రశంసిస్తున్నారు. అవును నిజమే కదా! అమ్ముడుపోని అక్షరాలు ఇంకా ఉన్నాయి. దేశంలోని మీడియా సంస్థలు కుబేరుల వశం కావచ్చు. వార్తల వ్యాపారం మొదలవ్వొచ్చు. వ్యాపారమంటే మోసాలూ కొనసాగవచ్చు. కానీ నిజాయితీతో, విలువలతో, ప్రజలకు సత్యాన్ని తెలపాలనే తపనగల పాత్రికేయులు ఇంకా ఉన్నారు. ''నేను ఈ రంగంలోకి వచ్చినప్పుడు, జర్నలిజానికి అదొక స్వర్ణయుగం. ఇప్పుడు భస్మయుగం నడుస్తోంది. స్వతంత్ర సంస్థలన్నీ ధ్వంసమయ్యాయి'' అని ఆయన అన్నాడంటే... ఎంత మార్పులు వ్యవస్థలో వచ్చాయో అర్థం చేసుకోవాలి. ఈ రంగం స్వరూప స్వభావాలే మారిపోతున్నాయి. అధికార పక్షం ఆర్గాన్లు మారి, వారి ఎజెండా అడుగులకు మడుగులొత్తుతాయి. స్వతంత్ర గొంతుక మూయబడింది. ఇది వ్యక్తులకు జరిగే నష్టం కాదు. మొత్తం సమాజానికి కలిగేది.
ఇప్పుడిక ప్రజల గొంతులు ఛానెళ్లుకావాలి. పరి వ్యాప్తమయ్యే ఆధిపత్యాలపై ప్రశ్నలు ఎక్కుపెట్టాలి. ప్రశ్నించని వార్తకు పదునుండదు. నిజాయితీలేని మాటకు విలు వుండదు. సత్యం ధ్వనించని శబ్ధంలో శక్తి నిండదు. స్వేచ్ఛాక్షరాలు తమ దారిని తాము వెతుక్కుంటాయి. ముళ్లూ రాల్లూ ఎన్నున్నా ముందుకుపోయే అడుగులుంటాయి. కొనుగోళ్లకు లొంగని విలువలూ ఉంటాయి.