Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం ఎగుమతులను దెబ్బతీస్తుందన్న నిపుణుల హెచ్చరికలు నిజమని రుజువవుతున్నాయి. దేశ వాణిజ్యలోటు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ నుండి ఎగుమతులు భారీగా పడిపోవడం, మరోవైపు దిగుమతులు పెరగడంతో లోటు ఎగిసి పడుతోంది. అక్టోబర్‌నెలలో సరుకుల ఎగుమతులు 16.65శాతం పతనమై 29.75బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవలే వెల్లడించింది. దిగుమతులు 5.7శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం భారత వాణిజ్య లోటు 26.91 బిలియన్ డాలర్లకు (రూ.2.17 లక్షల కోట్లు) ఎగిసింది. వజ్రాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల వంటివాటి ఎగుమతులు తగ్గిపోయాయి. అంతర్జాతీయ విపణిలో మనం చేసే ప్రధానమైన ఉత్పత్తుల ఎగుమతిలోనే అంత తరుగుదల రావడం ప్రమాదకర సంకేతం. మరోవైపున ఎప్పటికన్నా ఎక్కువగా చమురు దిగుమతి జరిగింది. అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 29.1శాతం పెరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వాణిజ్యం కుదించుకుపోతుందనే ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఎగుమతి దిగుమతుల విషయంలో మరింత జాగరూకత అవసరం.
గడచిన మూడు నాలుగు నెలలుగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది. రూపాయి చరిత్రలోనే అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో అత్యంత కనిష్టంగా డాలర్‌తో రూపాయి మారకంలో 83.20కి క్షీణించింది. అయితే తరువాత బలపడుతుందని ఊరడింపులు చేస్తున్నా ఆ జాడలేం కనుచూపుమేరలో అగుపించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ఒపెక్ దేశాలు చమురు వెలికితీతకు కోతలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. మన దేశ అవసరాల్లో 80శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. చమురు ధరలు అమాంతం పెరిగిపోతే ఇంధన వ్యయం, రవాణా ఖర్చు పెరిగి, అన్నిటి ధరలూ ఆకాశానికి ఎగబాకుతాయి. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కష్టాలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపున ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న పేరుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. అందువల్ల గృహ నిర్మాణానికో లేక ఇతర అవసరాలకో బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి పెను భారమవుతుంది. విదేశీ వాణిజ్యలోటు పెరగడంతోపాటు ఖజానాకు ద్రవ్యలోటు కూడా పెరుగుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతోందని, మరోవైపు అమెరికా, ఐరోపా బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈ దేశంలోని పెట్టుబడులు మరింతగా వెనక్కు తీసుకుపోతారు. సెప్టెంబర్ నెలలోనే విదేశీ సంస్థాగత పెట్టుబడులు 700కోట్ల డాలర్లకు పైగా ఇతర దేశాలకు వెళ్లిపోయాయి. ఆ వేగం ఇంకా పెరగవచ్చు. రూపాయి మరింతగా బలహీనపడు తుందన్నది విశ్లేషకుల మాట. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తరగడం, ద్రవ్యోల్బణం పెరగడం జరిగితే అక్కడ విదేశీ పెట్టుబడులు నిలవవని ప్రపంచ అనుభవం చెబుతోంది. కాబట్టి ఇదో విష చక్రం. పర్యవసానంగా రూపాయి విలువ మరింత దిగజారడం, దేశంలో ధరలు పైపైకి పెరగడానికే దారి తీస్తుంది. ఈ దుస్థితి మారాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాలి. దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ఆ సరుకుల్ని వినిమయం చేసేంతగా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అంతర్గత ఆర్థికాభివృద్ధి కీలకం. అందుకు అనువైన ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలి. కాని, మోడీ ప్రభుత్వం తనంతట తాను అందుకు పూనుకోదు కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావాలి. అదే మన ముందున్న మార్గం.