Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎరుగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి...''
అంటూ సాగే ప్రేమనగర్‌లోని ఈ పాట అప్పట్లో చాలా ఫేమస్. ఇప్పుడు మన నేతలు వల్లిస్తున్న నీతులు వింటుంటే ఆ పాటలోని మాటలెంత నిజమో మరోసారి రుజువవుతోంది. ''కోవిడ్ దేవుడి దయవల్లే పోయింది'' అన్నందుకు... హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు మండిపడుతున్నారు! అవును... సైన్సు ఒక్కటే సత్యమని కరోనా నిరూపించాక కూడా ''దేవుడే కాపాడాడు'' అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు! అందువల్ల బండి వారి మండిపాటును తప్పుపట్టలేం. కాకపోతే, ఈ మండిపాటులో సదరు అధికారి ప్రస్తావించిన 'దేవుడు' తమ మతానికి చెందినవాడు కాదనే అక్కసు మాత్రమే కనిపిస్తుండటం విస్తుగొలుపుతోంది..!
పనిలో పనిగా హెల్త్ డైరెక్టర్ గారి అవినీతి మీద కూడా వారు విరుచుకుపడ్డారు, అది వేరేసంగతి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ''ఒక ప్రభుత్వ అధికారివై ఉండి ఒక మతానికి కొమ్ముకాస్తావా?'' అని నిలదీసారు. ''మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావ్'' అంటూ హెచ్చరించారు. అదీ విశేషం! ఇదంతా చూస్తుంటే మాట్లాడుతున్నది బీజేపీ నాయకుడేనా? అని అనిపించక మానదు. భజరంగ్‌దళ్ వారైతే డీహెచ్ ప్రధాన కార్యాలయం ముందు ఏకంగా ధర్నాకే దిగారు. ''ఉన్నతమైన పదవిలో ఉండి ఓ మతాన్ని ప్రేరేపించేలా వ్యవహరించిన శ్రీనివాసరావును విధుల నుండి తొలగించాల''ని డిమాండ్ చేసారు. నిజంగా ఆ అధికారి అంతటి విద్వేషానికి పాల్పడితే చర్య తీసుకోవాలనడాన్ని కాదనలేం. కానీ మత విద్వేషాల గురించి వీరు నీతులు వల్లించడం మాత్రం గురివింద నీతినే గుర్తుచేస్తోంది. ఎందుకంటే కరోనాను సైతం మత కలహాలకు, తమ రాజకీయ ప్రయోజనాలకు సాధనంగా వినియోగించడంలో వీరిని మించినవారెవరు? మొదట్లో ఒక మతానికి చెందినవారి నుండే దేశంలో ఈ మహమ్మారి వ్యాపించిందని చెప్పినవాళ్ళు, దీపాలు వెలిగించి, మంత్రాలు జపించి కరోనాను పారదోలామని పలికినవాళ్ళు... ఇప్పుడు మాత్రం దేవుడు కాపాడాడంటే తప్పుపట్టడంలోని అర్థమేమిటీ, మత విద్వేషాల గురించి మాట్లాడటంలోని పరమార్థమేమిటి? ఆ దేవుడు పరాయి మతస్తుడు కావడమేనా? అంటే తాము చేస్తే ఒప్పు ఎదుటివాడు చేస్తే తప్పా! తప్పు ఎవరు చేసినా తప్పే కదా..!!
అయినా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? వీరి జాతీయ నేతలే ఈ తరహా వ్యవహారాలకు ఆద్యులైతే ఈ ప్రాంతీయ నాయకులను నిందించి ప్రయోజనమేమిటి? ఇప్పటికీ కరోనాను రాజకీయాలకు వాడుకోవడంలో వీరి తీరు మారలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాపితంగా కరోనా కేసులు తిగిరి పెరుగుతున్న తరుణంలో ప్రధాని సహా వీరి ప్రధాన నేతలంతా మాస్కులు ధరించి పార్లమెంటులోకి ప్రవేశించారు. మళ్ళీ పళ్లాలు మోగించి, చప్పట్లు కొట్టమని ప్రభోదించలేదు గనక సంతోషించాల్సిందే. అంతే కాదు కోవిడ్‌పై ఓ ఉన్నత స్థాయి సమీక్ష జరిపి ముప్పు ముగియలేదని ప్రధాని హెచ్చరించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వండని అప్రమత్తం చేస్తూ పిలుపునిచ్చారు. ఎప్పటిలాగే కేంద్రం ఆమేరకు రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలూ జారీ చేసి చేతులు దులుపుకుంది. ముందు ముందు ఆచరణ ఎలా ఉంటుందన్న సంగతి అలా ఉంచితే ఇప్పటికిది ఎంతోకొంత ఆహ్వానించాల్సిందే. అయితే దీనిని కూడా ఓ అందివచ్చిన అవకాశంగా భావించారో ఏమో గానీ, రాహుల్‌గాంధీని భారత్ జోడో యాత్ర నిలిపివేయమని కేంద్రం తరుపున లేఖాస్త్రం సంధించారు. అదే సమయంలో తెలంగాణ, రాజస్థాన్‌లో తమ పార్టీ అధ్యక్షులు నిర్వహిస్తున్న యాత్రలను మాత్రం విస్మరించారు. ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భాన్ని కూడా తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని కొట్టిపారేయలేం కూడా. అలాగని కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించకుండా ఇలాంటి యాత్రలు జరిపితే అది వైరస్ వ్యాప్తికి కారణమవుతుందన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తోసిపుచ్చలేం.
కానీ... దేశంలో కేసులు, మరణాలు లక్షల్లో సంభవిస్తున్న కాలంలోనే ప్రజల ప్రాణాలను ఫణంగాపెట్టి ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన ''రాజనీతి'' వీరిది! గంగలో శవాలు ప్రవహిస్తున్నా ఈ ప్రొటోకాల్సన్నీ తుంగలో తొక్కి కుంభమేళాలు జరిపిన ''ఖ్యాతి'' వీరిది!! పైగా ప్రజలేమైపోతారన్న ధ్యాసే మరిచి తమ సభలకు తరలించగా వచ్చిన జనాన్ని చూసి మురిసిపోయారు కదా..! అలాంటివారు తమకు లేని నీతిని ఎదుటివారికి బోధిస్తుంటే అందులో రాజకీయంగాక, నీతీ నిజాయితీ ఉందంటే ఎలా నమ్మగలం? ''తాను వలచింది రంభ తాను మునిగేది గంగ'' అన్న తీరున వ్యవహరిస్తున్న వీరు, ఒక వేలుతో ఎదుటివారిని చూపిస్తే మిగతా నాలుగువేళ్లు తమనే చూపిస్తాయన్న చిన్న విషయం తెలియనివారని అనుకోలేం. బహుశా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే తత్వం నెత్తికెక్కింది కాబోలు! లేదా ఈ నీతులన్నీ అనుభవం నేర్పిన పాఠాలో పరివర్తనలో అయితే ఫరవాలేదు గానీ, కేవలం ఎదుటివాడికి చెప్పేందుకంటేనే ఆక్షేపణీయం.