Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి? ''ఆసియా-పసిఫిక్ కరెన్సీలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రూపాయి''. 2014 మే 25వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. అదే పత్రిక 2022 డిసెంబరు 30వ తేదీన ''ఆసియన్ కరెన్సీలో చెత్త ప్రదర్శనతో ముగిసిన రూపాయి'' అనే శీర్షికతో వార్తను ఇచ్చింది. నాడు వార్త రాసినప్పుడు డాలరుకు రూపాయి మారకం రేటు రూ.58.52 కాగా 2022 డిసెంబరు 30న ముగిసిన రేటు రూ.82.72. ఎంత పతనం?
2014 జనవరి ప్రారంభంలో రూ.61.80గా ఉన్న రూపాయి విలువ కొత్త ప్రభుత్వం వస్తుందన్న ఉల్లాసం, విదేశాల నుంచి డాలర్ల ప్రవాహంతో ఆరు నెలల్లో 58.52కు పెరిగింది, 328 పైసలు లాభపడింది. అలాంటి ఉల్లాసానికి కారకుడైన నరేంద్ర మోడీ ఏలుబడిలో ఇప్పటికి 2,420 పైసల నీరసం మిగిలింది. గతేడాది చివరిలో రూ.74.33గా ఉన్నది కాస్తా పన్నెండు నెలల్లో రూ.82.72కు అంటే 839 పైసలు దిగజారింది. రూపాయి పతనంతో దిగుమతులు భారమై కష్టాలు పెరిగాయి. పోనీ వాటికి విరుగుడుగా తన పలుకుబడితో ఎగుమతులు పెంచారా అంటే అదీ లేదు.
మన్మోహన్సింగ్ పాలనలో 2013లో మన కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. ఆ తరువాత 2022లో 11.3శాతం పతనంతో నరేంద్ర మోడీ తనదైన రికార్డు నెలకొల్పారు. వచ్చే ఏడాది కొంత మేర విలువ పెరగవచ్చనే ఆశాభావంతో పాటు ఇంకా పతనం కావచ్చనే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. జనవరి-మార్చి నెలల్లో రూ.81.50 నుంచి 83.50 మధ్య రూపాయి విలువ ఉండవచ్చని కొందరి అంచనా. తీవ్రమైన అనిశ్చితి. ధనిక దేశాల్లో మాంద్య తీవ్రత ఎలా ఉంటుంది, ఎంత కాలం కొనసాగుతుంది అన్నది ఎవరికీ అంతుబట్టటం లేదు. ఇప్పటికే మన ఎగుమతులు అధోముఖంగా ఉన్నాయి.
నరేంద్ర మోడీ పాలన పదవ ఏటలో ప్రవేశించే ముందు రూపాయి పతనంలోనే కాదు, ఇంకా అనేక రికార్డులు నెలకొల్పుతున్నారు. 2022-23వ సంవత్సరం రెండవ త్రైమాస కాలం (జులై-సెప్టెంబరు)లో దిగుమతులు-ఎగుమతుల్లో (దీనిని కరంట్ ఖాతా అంటారు) 36.4బిలియన్ డాలర్లు లోటు ఉంది. ఇది జీడీపీలో 4.4శాతానికి సమానం. గతేడాది ఇదే కాలంలో ఉన్న లోటు 9.7బి.డాలర్లు మాత్రమే. మన దేశం నుంచి వస్తువులతో పాటు సేవల ఎగుమతులు కూడా ఉన్నాయి. వస్తు లావాదేవీల లోటు గతేడాది 44.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది 83.5 బి.డాలర్లకు పెరిగింది. వస్తు సేవలకు సంబంధించి మిగులు 25.6 నుంచి 34.4బి.డాలర్లకు పెరిగింది. ఇది కాస్త ఊరట కలిగిస్తోంది. 2012లో అక్టోబరు-డిసెంబరు మాసాల్లో వాణిజ్యలోటు 32.6 బి.డాలర్లు ఒక రికార్డు కాగా నరేంద్రమోడీ దాన్ని బద్దలు కొట్టారు. ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. సెప్టెంబరు తరువాత పరిస్థితి దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.
డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఎగుమతి-దిగుమతి లావాదేవీల వివరాలను వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మన ఎగుమతులు 424.45 నుంచి 499.67 బి.డాలర్లకు (17.72 శాతం) పెరగ్గా దిగుమతులు 471.68 నుంచి 610.7 బి.డాలర్లకు (29.47 శాతం) పెరిగాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 47.23 నుంచి 111.02 బి.డాలర్లకు పెరిగింది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యలోటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 102.63 బి.డాలర్ల నుంచి 192.41 బి.డాలర్లకు పెరిగింది. ఈ లెక్కన 2023 మార్చితో ముగిసే సంవత్సరంలో ఎంతకు చేరుతుందో చూడాల్సి ఉంది.
ప్రకటిత లక్ష్యం కనుచూపు మేరలో కనిపించకున్నా ఇంకా మన నేతలు 2025 నాటికి దేశ జీడీపీని ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని చెబుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు విదేశాంగ మంత్రి జైశంకర్ సైప్రస్‌లో మాట్లాడుతూ ఇదే చెప్పారు. 2025 మార్చి నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు, 2033-34 నాటికి పది లక్షల కోట్ల డాలర్ల సాధిస్తామని 2019లో ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ప్రస్తుత అంచనా 2022 ప్రకారం 3.3లక్షల కోట్ల డాలర్లు. కరోనా తదితర కారణాలను చూపుతూ 2025 గడువును 2027కు పెంచినట్లు కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల పాటు సగటున ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లను సాధించగలమని రిజర్వుబాంకు మాజీ గవర్నర్ డి.సుబ్బారావు 2022 ఆగస్టులో చెప్పారు. ఇలా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ సంపదల మాదిరి దేశ జీడీపీ కూడా పెరుగుతుందని జనాన్ని నమ్మమంటున్నారు. ప్రపంచ జీడీపీలో మొత్తం సంపదలో చూస్తే అగ్ర స్థానంలో ఉన్న అమెరికా తలసరి జీడీపీలో ఏడవ స్థానంలో ఉంది. రెండవదిగా ఉన్న చైనా 77వ స్థానం, ఐదవదిగా ఉన్న మన దేశం 128వదిగా ఉంది. మన దేశం అమెరికా, చైనాలను దాటి వద్ధి సాధించేందుకు పోటీ పడాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కానీ మనం ఎక్కడ ఉన్నాం, ఎంత ఎదగాలి?