Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న పచ్చి మితవాదుల (అక్కడి మీడియా, వామపక్ష శక్తులు వారిని ఫాసిస్టులని వర్ణిస్తున్నారు) ప్రభావం మరోసారి వెల్లడైంది. రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను గుర్తించేందుకు నిరాకరించి 2021 జనవరి 6న తన అనుచరులను వాషింగ్టన్ నగరంలోని పార్లమెంటు భవనంపై దాడిచేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే శక్తులు పార్లమెంటులో మెజారిటీ సాధించటంతో స్పీకర్‌గా తమ చెప్పుచేతల్లో ఉండేవారిని ఎన్నుకోవాలని పట్టుబడుతున్నాయి. దాంతో 118వ ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్) చరిత్రలో అసాధారణ ఉదంతం పునరావృతమైంది. పార్లమెంటు ఎన్నికలు జరిగిన తరువాత కొత్త సభ స్పీకర్‌ను ఎన్నుకోవటం తెలిసిందే. దాని కోసం మంగళ, బుధవారాల్లో ఆరుసార్ల్లు ఓటింగ్ జరిగినా అవసరమైన ఓట్లు రాకపోవటంతో ఎన్నికను వాయిదా వేశారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. తలెత్తిన వివాదం టీకప్పులో తుపానులా సమసి పోతుందా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
1855లో 34వ పార్లమెంటు స్పీకర్ ఎన్నికలో తగినన్ని ఓట్లు రాక రెండు నెలల పాటు వాయిదా పడి తరువాత రాజీ మార్గంగా ఒక చిన్న పార్టీ సభ్యుడిని ఎన్నుకున్నారు. దానికి ఆ నాడు ఒక సైద్దాంతిక ప్రాతిపదిక ఉంది. దేశంలో బానిసత్వం, విదేశీ వలసలను అడ్డుకొనే అంశాలపై తలెత్తిన వివాదంపై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రధానంగా బానిసల కొనసాగింపునకు అనుకూలమా ప్రతికూలమా అన్న ప్రాతిపదికన సమీకరణలు జరిగాయి. నాటి సభలో 234 స్థానాలకు గాను డెమోక్రాట్లకు 83, ప్రతిపక్షాలకు 100, అమెరికన్ల పేరుతో ఉన్న పార్టీలకు 51వచ్చాయి. నాటి నిబంధనల ప్రకారం స్పీకర్‌ను ఎన్నుకొనేందుకు అవసరమైన 133ఓట్లు ఎవరికీ రాలేదు, దాంతో1855 డిసెంబరులో సమావేశమైన ప్రజాప్రతినిధుల సభలో స్పీకర్ పదవికి 21మంది పోటీ పడ్డారు. ఆ వివాదం రెండు నెలలు కొనసాగి 1856 ఫిబ్రవరి రెండున వివిధ పార్టీలకు చెందిన వారు ఒక చిన్న పార్టీ సభ్యుడిని ఎన్నుకున్నారు. తరువాత 1923లో రిపబ్లికన్ పార్టీలో తలెత్తిన ముఠా కుమ్ములాటల కారణంగా తొమ్మిది సార్లు ఓటింగ్ జరిగిన తరువాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం సభలోని 435మంది సభ్యులకుగాను ప్రతిపక్ష రిపబ్లికన్లకు 222, అధికార డెమోక్రాట్లకు 213మంది ఉన్నారు. మరొక పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఎన్నికకు సాధారణ మెజారిటీ 218ఓట్లు వచ్చిన వారు స్పీకర్ అవుతారు. తాజా ప్రతిష్ఠంభనకు అధికార పార్టీలోని కుమ్ములాటలతో పాటు, రిపబ్లికన్ పార్టీలోని ఫాసిస్టుల పట్టు అన్నది స్పష్టం.
రిపబ్లికన్ పార్టీ నేతగా ఉన్న కెవిన్ మెకార్ధీ సీనియర్ నేత, రద్దయిన సభలో ఆ పార్టీ నేతగా పని చేశారు. ఈ సారి మెజారిటీ వచ్చినందున స్పీకర్ పదవిలో కూర్చుంటారని అందరూ భావించగా జరిగిన పరిణామాలు ఎప్పటి నుంచో ఆ పదవి కోసం ఎదురుచూసిన మెకార్ధీకి తీరని పరాభవాన్ని మిగిల్చాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల తరువాత స్పీకర్‌కే అధికారాలు ఎక్కువ. తాను పోటీ నుంచి తప్పుకొనేది లేదని మెకార్థీ చెబుతున్నప్పటికీ వెనక్కు తగ్గి స్టీవ్ కాలైజ్కు మద్దతు ఇస్తారని వార్తలొచ్చాయి. కాలైజ్కు మద్దతు ఇస్తారా అనడిగితే నవ్వి వెళ్లాడు. మెకార్ధీతో సహా రిపబ్లికన్ పార్టీ మొత్తం మితవాదులతో నిండి ఉంది. సభలోని రిపబిక్లన్లు 222 మందికి గాను అతగాడికి తొలి రెండు దఫాలు 203రాగా మూడవ సారి 202ఓట్లు మాత్రమే వచ్చాయి. తరువాత పెరిగినప్పటికీ అవసరమైన మెజారీటీ రాలేదు. ఇతగాడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారు. జో బైడెన్ ఎన్నికను గుర్తించరాదని ఓటు వేసిన వారిలో ఒకడు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీ పూర్తిగా ఫాసిస్టుల పెత్తనంలో కొనసాగాలని కోరుతున్నవారు అతన్ని ససేమిరా అంగీకరించేది లేదంటున్నారు. మధ్యలో అసలు మెకార్థీ ఎందుకు, మనలో ఒకరే ఉంటే పోలా అని ఫాసిస్టులు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. పార్లమెంటు వెలుపల ఉన్న ఫాసిస్టు బృందాలు కూడా మెకార్ధీని ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. పైకి ట్రంప్ మాత్రం తన మద్దతు మెకార్ధీకే అంటున్నాడు. స్పీకర్ ఎన్నిక జరగకుండా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసేందుకు, వివిధ పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు, సమీక్షలు, విచారణలు జరిపేందుకు అవకాశం లేదు. పార్లమెంటుపై దాడి తరువాత కాపిల్హిల్ భవనంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. మంగళవారంతో ఆ గడువు ముగిసింది. తిరిగి పునరుద్దరణ నిర్ణయం తీసుకోకపోతే ఎంపీలు తమ వెంట మారణాయుధాలను తీసుకుపోవచ్చు. ఆ నిబంధన విధించటంపై కొందరు ఫాసిస్టు ఎంపీలు బహిరంగంగానే మండిపడ్డారు. ఆ నిబంధన లేకుంటే గతంలో అంతర్యుద్ధ సమయంలో మాదిరి పార్లమెంటు ప్రాంగణంలో హింసాకాండ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు గుర్తు చేస్తున్నారు. స్పీకర్ ఎన్నికపై తాజా పరిణామాలు మరింత ప్రమాదకర పోకడలు, పరిణామాలకు నాంది అని చెప్పవచ్చు.