Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న అభిప్రాయాలు, భిన్నమైన నమ్మకాలు, విభిన్నమైన సంప్రదాయాల సమ్మేళన స్థలి భారతదేశం. ఎవరి అభిప్రాయాన్నయినా వ్యక్తపరచుకునేందుకు హక్కును కలిపిస్తున్న రాజ్యాంగమున్న దేశం మనది. అందుకే ఈ దేశ పౌరులంగా మన మంతా గర్వపడతాం. దేశాన్ని ప్రేమిస్తాం. భారతీయులందరినీ సహౌదరులుగా భావిస్తాం. కలిసి నడిచేందుకు ప్రతిజ్ఞ చేస్తాం. బహువిధమైన వారసత్వానికి ఆనందపడతాం. మరిప్పుడు ఏమైందీ ఆలోచనలకు? కారుమబ్బులేవో కమ్మేస్తున్నాయి క్రమంగా... చీకటి తలుపులేవో తెరుచుకుంటున్నాయి! భిన్న అభిప్రాయాలపై దౌర్జన్య కోరలేవో దాడులకు తెగబడుతున్నాయి. ఆలోచనల్లో అంధత్వం తాండవిస్తోంది. సహన పూరిత సహజీవన దృశ్యం అదృశ్యమవుతోంది. డెబ్బయి ఐదేండ్లుగా నిలుపుకున్న విలువలు నిలువునా ధ్వంసమవుతున్న చిత్రం ప్రత్యక్షమవుతోంది.
వాళ్లు వేటినీ వొదలటం లేదు. రాజ్యాంగపు విలువలనే కాలరాస్తున్నారు. విద్యను కాషాయీకరించటమే కాదు, విద్యార్థులనూ, అధ్యాపకులనూ మార్చేందుకు బలప్రయోగాలనూ ఉపయోగిస్తున్నారు. విద్యార్థులను శాస్త్రీయ ఆలోచనాపరులుగా తీర్చిదిద్దడం, వారిలో ప్రశ్నించే తత్వాన్ని పురికొల్పడం ఉపాధ్యాయుల విధి. అలాంటి వారితో ప్రశ్నించడం నేరమని క్షమాపణలు చెప్పించడం ఎంత ఘోరమైన సంఘటన. ఇది సాక్షాత్తు మన చైతన్య యుతమైన తెలంగాణ నేలపై జరగడం బాధాకరమైన విషయం. నిజామాబాద్జిల్లాలో గణపతి ఉత్సవాలకు చందా ఇవ్వలేదని, దేవుడిపైన నమ్మకం లేదన్న కసితో పాఠశాల ఉపాధ్యాయుడిపై కక్షగట్టింది అక్కడి మతతత్వం. బలవంతంగా ఆ గురువును గుడిలోకి తీసుకెళ్లి క్షమాపణలు చెప్పించటం గమనిస్తే, మన విద్యా వ్యవస్థలోకి మూఢత్వ విద్వేషం ఎలా దూసుకొస్తుందో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం ఒక సంఘటనగానే అర్థం చేసుకోలేము. రాబోయే కాలంలో విజ్ఞానానికి, స్వేచ్ఛకు, విద్యార్థులకు, విద్యా వికాసానికి ఎన్ని అడ్డంకులు రానున్నాయో తెలిపే సూచిక ఇది. అంతే కాదు, ప్రశ్నించడం మీద దాడి జరుగుతున్నప్పుడు, తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోలేనప్పుడు, లౌకిక విలువలను తుంగలో తొక్కుతున్నప్పుడు, మన రాజ్యాంగం నిర్వీర్యమైపోతున్నదన్న విషయం మనకర్థం కావాలి.
దేవుడిపై విశ్వాసము ఉండటానికి మనకెంత హక్కువుందో, విశ్వాసములేకుండా ఉండటానికీ అంతే హక్కువుంటుంది. ఈ విషయం అనేకమార్లు కోర్టులు కూడా పేర్కొన్నాయి. గత సంవత్సరంలో మద్రాస్ హైకోర్టు స్పష్టంగానే ప్రకటించింది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవరూ హరించలేరని తెలిపింది. తమిళనాడులో అనేక చోట్ల నెలకొల్పిన రామస్వామి విగ్రహాల కింద 'దేవుడులేడు' అని చెక్కి ఉండటం తమ మనోభావాల్ని దెబ్బతీస్తోందని, దేవుడు సర్వాతర్యామి అని భావించే వారంతా ఇబ్బంది పడుతున్నారని ఒక వ్యక్తి వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది కూడా. 'దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే, దేవుడు లేడని చెప్పే హక్కూ ఉంటుంది. దీన్ని రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావప్రకటనకు అందరూ తమకు నచ్చినట్లు చేయవచ్చు' అని చెప్పిన విషయాన్ని ఈ మహాభక్త శిఖామణులు గ్రహించాలి. ఈ దేశంలో పూజలు, ఆరాధనలు చేస్తే వారు అనాదిగావున్నారు. వేరు వేరు సంప్రదాయాలలో వారి భక్తినీ కొనసాగిస్తూవున్నారు. కానీ ఇప్పుడు దేవుడి పేరిట, పూజల పేరిట, మతం పేరిట ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, ఉన్మాదంగా వ్యవహరించడం అనేది రాజకీయంగా లబ్దిపొందేందుకు నేడు రెచ్చగొట్టబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. బడి అంటే సమాజానికి సూక్ష్మరూపం. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల విభేదాలకతీతంగా విజ్ఞానం వెల్లివిరియాల్సిన ప్రదేశం. అందులో గురువు మార్గదర్శి. బోధన అభ్యసనాల పరిమళమే తప్ప మత భావనలకు తావుండరాదు. వాటిని కలుషితం చేయాలని పూనుకోవడాన్ని నిరోధించాలి. ఈ సందర్భంగా మన శాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ చెప్పినమాటలు గుర్తుచేసుకోవాలి. ''నేడు భారతదేశం అజ్ఞానం, మత ఛాందసం, మతోన్మాదాల అగాధంలోనూ, అన్ని రకాల జడ పదార్థాల పూజల లోనూ మునిగిపోయి ఉంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి దేశాన్ని ఏ శక్తి బయటపడేయ గలదు? మన జీవితంలో ఇబ్బంది పెడుతున్న సమస్య లన్నింటినీ ఒక్క దెబ్బతో ఏ శక్తి పరిష్కరించగలదు? దీనికి ఒకే ఒక్క సమాధానం... అదే విజ్ఞాన శాస్త్రం'' అని ఆయన చెప్పిన సత్యవాక్కులు వీరి చెవికి ఎక్కుతాయా! విజ్ఞానం వికసించడానికి కావాల్సిన స్వేచ్ఛా వాతావరణాన్ని తీసివేసి, విశ్వాసాల ఆధారంగా ప్రగతిని సాధించలేమనే విషయం బోధపడేదెప్పుడు!