Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నీ అభిప్రాయాలతో ఏకీభవించక పోవచ్చు... కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కోసం నా ప్రాణమిస్తా'' అంటాడు ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్. ఇది కదా నిజమైన ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామ్యమంటేనే భిన్నాభిప్రాయాలను మన్నించడం, ప్రశ్నలను, విమర్శలను గౌరవించడం కదా... ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం మన దేశంలో ప్రజాస్వామ్యమే అమలవుతోందా? అన్న సందేహం రాకమానదు. ఇప్పుడీ సందేహానికి కారణం భారత ప్రజాస్వామ్యం పట్ల రాహుల్‌గాంధీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలు కాదు, స్వదేశంలో ''చేతన్ కుమార్ అహింస'' అనే ఓ కన్నడ నటుడిని అరెస్ట్ చేయడం. దళిత, గిరిజనహక్కుల కార్యకర్త కూడా అయిన ఈ చేతన్‌కుమార్ నేరమేమిటంటే... ''హిందూత్వ అనేది అబద్ధాల ఆధారంగా నిర్మించబడింది'' అని ట్వీట్ చేయడమే..! ఈ అబద్ధాలను రుజువు చేయడానికి అతను కొన్ని ఉదాహరణలను పేర్కొన్నాడు. అందులో ''రావణుడిని ఓడించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పటి నుండే భారతదేశం ప్రారంభమైంది'' అన్న సావర్కర్ వాదన ఒకటి. హిందూత్వవాదులు ''బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం''అని చెప్పడం మరొకటి. అన్నిటికీ మించి, వొక్కలిగ వర్గానికి చెందిన ఊరిగౌడ, సంజెగౌడలే టిప్పుసుల్తాన్ను హత్య చేశారంటూ సాగుతున్న ప్రస్తుత ప్రచారమంతా పచ్చి అబద్ధమని కూడా చేతన్ కుమార్ ట్వీట్ చేశాడు. దీనిపై ఓ భజరంగ్‌దళ్ సభ్యుడు చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారంనాడు బెంగుళూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాడనీ, మత విశ్వాసాలను అవమానించాడనీ కేసు నమోదు చేశారు. కేవలం అభిప్రాయాలు వెల్లడించినంతనే ఇంతటి అభియోగాలు మోపబడుతున్న చోట ప్రజాస్వామ్యం మనగలగుతుందంటే ఎలా నమ్మడం?
నిజానికి, 1799లో బ్రిటిష్‌వారితో పోరాడుతూ మరణించిన యోధుడు టిప్పుసుల్తాన్ అని చరిత్ర చెపుతోంది. కానీ, కర్నాటకలో ఇందుకు విరుద్ధంగా ఒక నాటకం రూపొందించబడింది. ఇది ఊరిగౌడ, సంజెగౌడ అనే ఇద్దరు వొక్కలిగ నాయకులు టిప్పు సుల్తాన్‌ను హత్య చేసినట్టుగా చిత్రీకరిస్తోంది. అయితే, కల్పిత పాత్రలూ కట్టుకథలతో కూడిన ఈ వక్రీకరణను చరిత్రకారులంతా ప్రశ్నించారు. కానీ కర్నాటక కమలనాథులు మాత్రం ఈ కల్పితాన్ని ఏకంగా ఎన్నికల ర్యాలీలలో ఉపయోగించారు. కన్నడ ప్రజలకు చారిత్రక స్ఫూర్తిగా నిలిచిన టిప్పుసుల్తాన్ ముస్లిం కావడమే ఈ వక్రీకరణకు ఒక కారణంగా కాగా, రాష్ట్రంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న వొక్కలిగలను ముస్లిం వ్యతిరేకులుగా మార్చడం మరొక కారణమన్నది కొన్ని విశ్లేషణలూ, నివేదికల సారాంశంగా ఉన్నది. రాష్ట్రంలో బీజేపీయేతర రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్)లు కూడా ఇదంతా కేవలం ఓ కట్టుకథ అని కొట్టిపారేశాయి. వొక్కలిగ సంఘం నేతలు సైతం ''రాష్ట్ర ప్రభుత్వం ఈ అబద్ధాల ప్రచారం మానుకోకుంటే ఆందోళనలు చేపడతాం'' అని హెచ్చరించడం గమనార్హం. కర్నాటకలో నెలకొన్న ఈ పరిణామాల నేపథ్యంలోంచి చూస్తేగానీ చేతన్‌కుమార్ అరెస్ట్‌కు అసలు కారణాలు బోధపడవు.
రాహుల్ గాంధీ మన ప్రజాస్వామ్యం గురించి విదేశాల్లో మాట్లాడి దేశం పరువుతీశాడని అరచి గగ్గోలు పెడుతున్నవారంతా, ఇప్పుడీ చేతన్‌కుమార్ అరెస్ట్ దేనికి సూచికో సమాధానం చెప్పాలి. నేడు దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి ఇది మచ్చుకో ఉదాహరణ. కేవలం ఒక అభివ్యక్తికి కూడా అవకాశం లేని ఈ ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? దేశం పట్ల నిజమైన ప్రేమ ఉన్నవారంతా ఆలోచించాల్సిన అంశమిది. దేశంలో ప్రజాస్వామ్యమిలా ఉంటే, విదేశాల్లో పరువు తీసేందుకు ఏ రాహుల్‌గాంధీ అవసరం లేదు. పరస్పరం అనుసంధానించబడి, ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిన ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం మనం. పలు అంతర్జాతీయ నివేదికలే వెల్లడిస్తున్న ప్రపంచ ప్రజాస్వామిక సూచికలలో భారత్ స్థానమేమిటో తెలియనిదెవరికి? ఆకలీ అసమానతల సూచీల్లో సైతం మన అట్టడుగు స్థానమేమైనా జగమెరుగని సత్యమా?
అయినా నిజాలు గుర్తించలేకపోవడం, గుర్తించినా మభ్యపెట్టాలని చూడటం అభ్యంతరకరం, అనైతికం అవుతాయిగానీ, నిజాలు మాట్లాడటం తప్పెలా అవుతుంది? అభిప్రాయాలు వెల్లడించడం, ప్రశ్నించడం, విమర్శించడమే నేరమైతే అది ప్రజాస్వామ్యమెలా అవుతుంది? ఈ ప్రాథమిక సూత్రాన్ని కూడా నిరాకరించే నిరంకుశ పోకడలే ఈ దేశం పరువు తీస్తున్నాయనే సత్యాన్ని ఈ ఏలికలకు ఎవరు చెప్పాలి?