Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడున్నర దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మలియానా గ్రామంలో జరిగిన పాశవిక ఊచకోత అప్పట్లో యావత్ దేశానికి భయోత్పాతం కలిగించగా అటువంటి కేసులో నేరారోపణలెదుర్కొంటున్న 40మంది నిందితులకు స్థానిక న్యాయస్థానం క్లీన్చిట్ ఇవ్వడం జాతి మొత్తాన్నీ నివ్వెరపర్చింది. కోర్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని 36 ఏండ్లుగా నిరీక్షించిన బాధిత కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. 1987 మే 23న మీరట్ నగర శివార్లలోని మలియానా గ్రామంపై ప్రాంతీయ సాయుధ కానిస్టేబుళ్ల బృందం అర్థరాత్రి సమయంలో అల్లరి మూకలను వెంబడేసుకొని విచక్షణా రహితంగా కాల్పులు జరపగా 72మంది ముస్లింలు మరణించారు. ఈ మారణకాండ కేసు పోలీస్ దర్యాప్తు, కోర్టు విచారణ నత్తకు నడక నేర్పింది. దాడిలో 93 మంది పాల్గొనగా దశాబ్దాలపాటు విచారణ సాగడంతో చనిపోయిన వారు చనిపోగా 40మంది నేర అభియోగం ఎదుర్కొం టున్నారు. 800తడవలు కోర్టులో విచారణానంతరం సరైన సాక్ష్యాలు లేవంటూ మధుర జిల్లాకోర్టు నిందితులను వదిలిపెట్టింది. దర్యాప్తు ఏజెన్సీలు, ప్రాసిక్యూషన్ విఫలం కావడం వలన, ఆ రెండు ప్రక్రియలూ ఆలస్యమైనందున బాధితులకు న్యాయం జరగలేదు.
మలియానా హింసాకాండ నేపథ్యాన్ని చూడాలి. వివాదాస్పద బాబ్రీ మసీదు తాళాలు తెరిచాక 1987 మే 17న మీరట్‌లో పెద్ద ఎత్తున మతఘర్షణలు చెలరేగాయి. నగరంలో కర్ఫ్యూ విధించారు. మలియానా దాడి జరగడానికి ఒక్క రోజు ముందు మే 22న మీరట్ శివార్లలోని హషింపురా నుంచి 40మంది ముస్లింలను ప్రాంతీయ సాయుధ దళం, అల్లరి మూకలతో కలిసి అపహరించి ఢిల్లీ-యూపీ బోర్డర్‌కు తరలించి కిరాతకంగా కాల్చి చంపింది. శవాలను అప్పర్గంగ కాల్వలో పడేశారు. ఈ కేసు ముప్పై ఏండ్లు నడవగా మొదటి ప్రయత్నంలోనే ప్రాసిక్యూషన్ కేసును రుజువు చేయడంలో వైఫల్యం చెందింది. ట్రయల్‌కోర్టులో సాయుధ దళం తన జనరల్ డైరీని చూపించలేదని తెలియ వచ్చింది. ఆ అంశమే 2018లో ఢిల్లీ హైకోర్టు నిందితులపై నేరారోపణలు చేసేందుకు అవకాశం కల్పించింది. మలియానా కేసులోనూ ఎఫ్ఐఆర్ వైఫల్యం కనిపిస్తుంది. ప్రాసిక్యూషన్ అత్యంత లోపభూయిష్టం గా పనిచేసిందని మధుర కోర్టు ఎత్తిచూపింది. ప్రాసిక్యూషన్ కోర్టుకు అందజేయాల్సిన డాక్యుమెంట్లను కనీసం క్రమపద్ధతిలో పెట్టలేదు. పోస్టుమార్టం రిపోర్టులను ఫొటోకాపీలను అందజేసింది. వాటిని కోర్టు సాక్ష్యాలుగా అంగీకరింపని విధంగా చేసింది. కొందరు నిందితులు సంఘటనకు ముందే చనిపోయారంటూ ఓటర్ల జాబితాలో వారి పేర్లను పోలీసులు మార్చే ప్రయత్నం చేశారని కోర్టు దృష్టికి వచ్చింది. దర్యాప్తు అధికారి క్రాస్ ఎగ్జామినేషన్‌ను పూర్తి చేయలేదు. ఇంత దారుణంగా ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ వ్యవస్థలు పని చేసినందునే నేరస్తులు బయటపడ్డారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక మత ఘర్షణల కేసుల్లో నిందితులకు శిక్షలు తక్కువగా పడుతున్నాయి. గడచిన ఐదేండ్లల్లో 30శాతం లోపే శిక్షలు పడ్డాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక పేర్కొంది. ఢిల్లీలో 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లుకానీ 2002లో గుజరాత్లో గోధ్రా అనంతర మారణ హోమంకానీ కేవలం విచారణలు ఆలస్యమైతేనో, దర్యాప్తు వ్యవస్థలు విఫలమైతేనో నిందితులు తప్పించు కున్నారనడం పాక్షిక విశ్లేషణే అవుతుంది. రాజకీయ ప్రభావం, దర్యాప్తు వ్యవస్థల కుమ్మక్కు కేసులు నీరుగారడానికి, న్యాయం ఆలస్యం కావడానికి, బాధితులకు న్యాయం దక్కకపోవడానికి ప్రధాన కారణాలు. పైకోర్టులను ఆశ్రయించి న్యాయం కోసం ప్రయత్నించాలి. గుజరాత్లో బిల్కిస్‌బానో కేసులో శిక్షలు పడ్డ నిందితులనూ వదిలిపెడుతున్న ప్రభుత్వాలు కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వేళ, మలియానా తీర్పు ఆందోళన కలిగిస్తుంది. మత విద్వేషాలు రెచ్చ గొడుతున్న ఉన్మాదశక్తులకు ఇంకా భయం లేకుండా పోతుంది. అటువంటి కుట్రలను ప్రజలు అప్రమత్తతతో ఎదుర్కోవాలి.